Tolivelugu.com

బలిపశువు

https://i2.wp.com/tolivelugu.com/wp-content/uploads/2020/02/sakshipost_2019-03_5bb951ea-32df-4cb5-86e6-abc2b3708278_kanna_laxmi_narayana.jpg

తనకు అలవాటు లేని పనిలోకి దిగాడు. అవసరం కోసం వెళ్లాడనుకున్నారు. కాని ఆ పనిని బాగా ఓన్ చేసుకున్నాడు. తన ఆలోచనలు.. మైండ్ సెట్.. అసలు తానే మారిపోయాడు. కాని కొన్నాళ్లకు ఆయననే మార్చేసి వేరేవారికి అప్పచెప్పారు. ఇప్పుడు ఎటుపోవాలో అర్ధం కాక దిక్కులు చూస్తున్నాడు. వ్రతం చెడ్డా ఫలం దక్కలేదే అనుకుంటూ ఆవేదన చెందుతున్నాడు. సోము వీర్రాజు కొత్త కమిటీలు అనౌన్స్ చేశాక మొదలైన చర్చ ఇదే. అందరూ అయ్యో పాపం కన్నా అనుకునేవారే.
కన్నా లక్ష్మీనారాయణ.. కాంగ్రెస్ లో సీనియర్.. మంత్రిగా పని చేసిన అనుభవం అన్నీ ఉన్నాయి. విభజన ఎదురైన వేళ.. కాంగ్రెస్ నుంచి చాలా మంది కొత్త దారులు వెతుక్కున్నారు. కొందరు వైసీపీ.. ఇంకొందరు టీడీపీ వైపు వెళితే.. కన్నా మాత్ర వెరైటీగా బిజెపి వైపు వెళ్లారు. పైగా జాయినయ్యే ఒక రోజు ముందు కూడా వైసీపీతో మంతనాలు జరిపినట్లు సమాచారం. ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు. పైగా ఆ టైమ్ లో బిజెపికి రాష్ట్రంలో గడ్డు కాలం. బిజెపి అంటే జనం కొట్టేలా ఉన్న సిట్యుయేషన్. ప్రత్యేక హోదాపై కమలం ఆడిన డ్రామాకు పరిస్ధితి అలా వచ్చింది.
అయినా ఎదురీతకు సిద్ధపడే కన్నా లక్ష్మీనారాయణ.. పగ్గాలు అందుకున్నారు. సంప్రదాయకంగా ఎప్పటి నుంచో బిజెపిలో ఉన్నవారంతా కన్నా రాకను వ్యతిరేకించారు. సోము వీర్రాజులాంటివారు అలిగారు. అయినా అందరినీ కలుపుకుపోవడానికి నానా ప్రయత్నాలు చేస్తూ.. పార్టీని మాత్రం యాక్టివేట్ చేశారు. హిందూత్వ నినాదాలు.. కొత్త అయినా.. వాటిని అవగాహన చేసుకుని మరీ.. వాటిపై కూడా యాక్టివ్ గా పని చేశారు. ఢిల్లీలో జాతీయ నాయకత్వం ఇచ్చిన ప్రతి పిలుపుకు స్పందిస్తూ… కార్యక్రమాలు నిర్వహించారు.
జనసేనను దగ్గరకు తీయడంలోను.. పవన్ కల్యాణ్ తో చర్చలు జరిపి.. ఒప్పించడంలోనూ కన్నా కీలక పాత్ర పోషించారని చెప్పుకుంటారు. బిజెపి, జనసేన జాయింట్ యాక్షన్స్ కు కూడా కన్నా లీడ్ తీసుకున్నారన్నది వాస్తవమే.
అయితే కన్నా జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాజధాని, ఇసుక ఇలా ప్రతి అంశంలోనూ చాలా స్పీడుగా స్పందిస్తూ.. విమర్శలు కురిపించడమే కాక.. పార్టీ ఆందోళన కార్యక్రమాలు కూడా ప్లాన్ చేశారు. దీంతో వైసీపీ కన్నాను టార్గెట్ చేసింది. అప్పటికీ జీవీఎల్ ద్వారా కన్నాను కంట్రోల్ చేయాలని చూసినా కుదరలేదు. కన్నా ఒక రకంగా.. జీవీఎల్ మరో రకంగా మాట్లాడుతున్నారనే చర్చ కూడా వచ్చింది. తర్వాత దానికి అధిష్టానం ఫుల్ స్టాప్ పెట్టింది. అయినా సోము వీర్రాజు మాత్రం బాబును తిడుతూ.. వైసీపీని మాత్రం టచ్ చేయలేదు. ఇటు కన్నా మాత్రం వైసీపీ పై ఫుల్ రేంజ్ లో అటాక్ చేశారు.
దీంతో పై స్థాయిలో ఎలాంటి పావులు కదిలాయో తెలియదు గాని.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కన్నాకు ట్విట్టర్ లో డైరెక్టు వార్నింగ్ ఇచ్చారు. ఒకసారేమో.. బాబు దగ్గర 100 కోట్లు తీసుకుని కోవర్టుగా పని చేస్తున్నాడని.. మరోసారేమో.. పార్టీ లైనుకు భిన్నంగా రాజధానిపై కన్నా మాట్లాడుతున్నాడని ట్వీట్ చేశారు. ఇవి బిజెపిలో సెన్సేషన్ రేపాయి. దీనిపై పెద్ద చర్చే జరిగింది. తర్వాత సరిగ్గా విజయసాయి వార్నింగ్ ఇచ్చినట్లుగానే జరిగింది. కన్నాను తప్పించి.. సోము వీర్రాజును నియమించారు. ఇక ఆ తర్వాత కన్నా టీమ్ ని నెమ్మదిగా పక్కన పెట్టారు. ఇప్పుడు కొత్త కమిటీల్లో అసలు వాసనే లేకుండా చూసుకున్నారు. దీంతో కన్నా లక్ష్మీనారాయణ వర్గం పూర్తిగా డీలా పడింది. కన్నా ఇప్పుడు డైలమాలో పడ్డారు. బిజెపి ఏదైనా పదవి ఇస్తుందేమోనని ఆశతో ఎదురు చూడాలా? లేక వేరే దారి చూసుకోవాలో అర్ధం కాక.. సైలెంట్ అయిపోయారు.

https://i0.wp.com/tolivelugu.com/wp-content/uploads/2020/08/300x250-telu.png